YSR KADAPA - కాళికాంబ సప్తశతి / వైయస్‌ఆర్ :
మంచి చెడ్డలందు మరియాద విడకుండ
నడచువాడె జగతి నాణెకాడు
పొంగికుంగుచుండు పోకిరి సన్నాసి
కాళికాంబ!హంస!కాళికాంబ
మానవ ప్రవర్తనను గురించి వీరబ్రహ్మంగారు చేసిన ప్రబోధం ఈ పద్యం. మంచిలోగానీ చెడ్డలోగానీ మర్యాదను అతిక్రమించకుండా ప్రవర్తించేవాడే సమాజంలో నాణ్యమైనవాడు. తనకు నచ్చినప్పుడు పొంగిపోయి నచ్చనప్పుడు కుంగిపోయి మర్యాదను ధ్వంసం చేసేవాడు వొట్టి పోకిరి సన్నాసి అని చెప్పారు బ్రహ్మంగారు. సమాజంలో అందరి ఇష్టాలు అందరి ఆలోచనలు అందరి ఆచరణలు ఒకేరకంగా ఉండవు. సమాజంలో చీలికలు ఉన్నప్పుడు వైరుధ్యాలూ బలంగానే ఉంటాయి. ఈవైరుధ్యాలు వాదోపవాదాలకూ ఒక్కోసారి ఘర్షణకు కూడా దారి తీయవచ్చు. అభిప్రాయాలను పంచుకోవడంలో ఒకరి అభిప్రాయాలతో విభేదించడంలో తప్పేమీలేదు. పైగా చర్చ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఒకరి అభిప్రాయాలను ఆమోదించినా వ్యతిరేకించినా అది నాగరికంగా జరగాలి. అనాగరికంగా జుగుప్సావహంగా జరగకూడదు. భావస్వేచ్ఛ మీద నమ్మకముంటే చర్చ నాగరికంగా సాగుతుంది. దానిమీద నమ్మకం లేనప్పుడు తిట్లు బూతులు బజారుభాష ప్రవేశిస్తాయి. ఎంతటి తీవ్రమైన భావభేదాన్నైనా సంస్కారవంతమైన భాషలోనే వ్యక్తం చేయవచ్చు. ఒకరి భావజాలంతో అందరూ ఏకీభవించాలని కఠోర నియమమేదీ లేదు. విభేదించవచ్చు. అయితే ఆ విభేదించడంలో మానవసంస్కారం ధ్వంసం కాకూడదు. అదీ బ్రహ్మంగారు చెప్పింది. వీథికొట్లాటల మొదలు చట్టసభల దాకా మాటల దుబారా హద్దలు దాటిపోతున్న నేటి సందర్భంలో మనం బ్రహ్మంగారి ప్రబోధాన్ని గమనించవలసి ఉంది. మహాభారతం విదురనీతిలో పలుకు ప్రల్లదము సప్తవ్యసనాలలో ఒకటిగా చెప్పాడు విదురుడు. ధర్మరాజు "వాక్పారుష్యము చన్నె"అంటాడు. భూస్వామ్య వ్యవస్థ ప్రతినిధులే అంతమంచి మాటలంటే ప్రజాస్వామ్యయుగంలో ఉన్న మనం ఇంకెంతమంచిగా ఆలోచించాలి. ఇంకెంతమంచిగా మాట్లాడుకోవాలి. కానీ నేటి రాజకీయవాదుల మాటలు వింటుంటే మనం నాగరిక యుగంలోనే ఉన్నామా అనిపిస్తుంది. మరీ ఎన్నికల సమయంలో చూస్తే చెవులు చిల్లులు పడతాయి. ఈజబ్బు సాహిత్యలోకంలోకి కూడా ప్రవేశించింది. ఒక రచయిత అభిప్రాయాల నచ్చకపోతే చెప్పండి. కానీ సాహిత్యం ద్వారా సంక్రమించిన సంస్కారాన్ని ధ్వంసం చేయకండి. సాహితీరంగమే సంస్కారపతితమైతే సమాజానికి ఇంకదిక్కెవరు? సంస్కారం లేకుండా వాదించుకొని సాహితీపరులు పోకిరి సన్నాసులు కాకూడదు. అందుకోసం బ్రహ్మంగారిని చదువుకుందాం.YSR KADAPA