పంచలోహ విగ్రహాలకు గుళ్ళు గోపురాలు కట్టించి రకరకాల ప్రసాదాలు వడ్డించి పట్టుపీతాంబరాలు ధరింపజేస్తారు. కానీ ప్రాణంతో ఉండే మనిషికి కూడు గూడు గడ్డలేకపోతే ఎందుకు పట్టించుకోరు అని ఈ పద్యంలో భక్తులను ప్రశ్నించారు బ్రహ్మంగారు. మనిషిని నిరాదరించి దేవుళ్ళకు మనుషులకు కల్పించే వైభవాలను కల్పించడం పట్ల గురజాడ జాషువ వంటి సామాజిక కవులు తీవ్రమైన విమర్శ పెట్టారు ఆధునిక కాలంలో. వాళ్ళకన్నా మూడువందల ఏళ్ళు ముందే వేమన వీరబ్రహ్మంలు ఈ విమర్శకు పునాది వేశారు. మనదేశం కులదేశం మతదేశం. ఇప్పుడు విగ్రహదేశంగా మారిపోతున్నది. ఏదేశంలోనైనా ఎన్నోకొన్ని విగ్రహాలు ఉంటాయి. ఆదేశ చరిత్ర నిర్మాణంలో ప్రముఖపాత్ర నిర్వహించిన వాళ్ళవో మరోకరివో ఉంటాయి. కానీ మనదేశంలో సుప్రీంకోర్టు అనుమతి తీసుకోకుండా విగ్రహాలు పెట్టకూడదు అని చట్టం తేచ్చేస్థితిని కల్పించినన్ని విగ్రహాలు ఉన్నాయి. దేవుళ్ళ విగ్రహాలు నాయకులు విగ్రహాలతో దేశం పిక్కటిల్లిపోతున్నది. ఇదలా ఉంచుదాం. దైవభావన ఏర్పడిన తర్వాత అది వ్యవస్థీకృతమై మతంరూపం తీసుకుంది. గుళ్ళు గోపురాలు మడులు మాన్యాలు పూజారులు ధర్మకర్తలు అనేకరకాల కైకంర్యాలు అభిషేకాలు మొక్కుబడులు తీర్థప్రసాదాలు చేరాయి. భక్తి ఉన్నవాళ్ళు ఉంచుకోనీ అందలోని శాస్త్రీయాశాస్త్రీయ అంశాలను పక్కనబెడదాం. ఇంత కర్మకాండ అవసరమా. ఆగుడులచుట్టూ ఎన్ని రాజకీయాలో ఇటీవల మనం చూస్తున్నాం. సమాజానికి అవసరమైన వస్తసముదయాన్నంతా అంటే కూడు గూడు గుడ్డ ఇవి ఉత్పత్తి కావడానికి అవసరమైన సమస్తవృత్తులను నిర్వహించే వాళ్ళకు తలదాచుకోడానికి ఇల్లు కడుపునిండా తినడానికి తిండి, కప్పుకోడానకీ కట్టుకోడానికీ బట్ట దొరకవు. ఇవి అవసరమే లేని విగ్రహాలకు అడక్కుండానే వచ్చి పడతాయి. ఈ స్థితిని చూసే గురజాడ మనిషి కవిత రాసి విగ్రహారాధనను విమర్శించారు. 17వశతాబ్దంలో బ్రహ్మంగారు అచ్చమైన సరళమైన తెలుగు భాషలో ఈ అసంబద్ధాంశాన్ని నిలదీశారు. బ్రహ్మంగారి కాలంకన్నా ఇవాళ ఈ విగ్రహాల రాజకీయాలు ఇబ్బడిముమ్మడిగా పెరిగి పోయాయి. పుణ్యక్షేత్రాలు టూరిస్టు సెంటర్లుగా మారిపోయాయి. కోట్లరూపాయల విలువచేసే ఆభరణాలు హుండీలు చేరిపోతున్నాయి. అక్రమాలు ఎవరూ అడక్కుండానే బయటపడిపోతున్నాయి. దేశంలో ఇంకా అనేకమంది అర్ధనగ్నంగా అత్యంతనగ్నంగా ఆకలిదప్పులతో ఫ్లాట్ ఫారాల మీద చెట్లకింద పడి ఉంటున్నారు. ఎంతోమంది పేద తల్లులు పౌష్టికాహారంలేక కన్ను మూస్తున్నారు. కానీ నీళ్ళు తాగలేని అన్నం నమలలేని గుడ్డలు కట్టుకోలేని విగ్రహాలకు నైవేద్యాలే నైవేద్యాలు. కైంకర్యాలే కైంకర్యాలు. నరున్ని కష్టపెట్టి నారాయణుని కొలిచే భక్తులను ప్రతిమల పెళ్ళిసేయుటకు వందలు వేలు వ్యయిస్తూ పేదల డొక్కలను పట్టించుకోనివాళ్ళను జాషువగారు నిలదీయకముందే రాతి బొమ్మలకేల రంగైనవలువలు అని వేమన ప్రశ్నించారు. ఆరనవెంటనే బ్రహ్మంగారు మరింత చురుకుగా పయనించారు.