ట్రాఫిక్ పోలీసుల నిర్వాకంతో విద్యార్థుల పరీక్ష మిస్ . . . డీసీపీకి ఫిర్యాదు చేసిన పాలిటెక్నిక్ విద్యార్థులు
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి :
ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం కారణంగా పాలిటెక్నిక్ విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. త్రిబుల్ రైడింగ్ కారణంతో బైక్ ను నిలిపిన ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులను వదలకుండా నిలుపుదల చేయడంతో సమయం మించిపోయి పరీక్షకు హాజరుకాలేని పరిస్థితి నెలకొన్న ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. బోధన్ మండలం కొప్పర్గకు చెందిన షేక్ రెహాన్, మహమ్మద్ ఉజఫ్, షేక్ అబ్రార్ లు పాలిటెక్నిక్ చదువుతున్నారు. మంగళవారం ఆర్సీఎస్ పరీక్షల కోసం బైక్ పై నిజామాబాద్ నగర శివారులోని దాస్ నగర్ లో గల వీఆర్ సీకి వెళ్తున్నారు. మంగళవారం ఉదయం నగర శివారులోని అర్సపల్లి నాలేడ్జి పార్కు స్కూల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు త్రిబుల్ రైడింగ్ వెళ్తున్నారని నిలిపివేశారు. వాహనంతో పాటు విద్యార్థులను అక్కడే నిలబెట్టడంతో పరీక్ష సమయం దాటిపోతుందని, తమను వదిలేయాలని విద్యార్థులను మొరపెట్టుకున్నారు. పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను చూపెట్టిన వదలకుండా అక్కడే ఉంచడంతో వారు పరీక్ష సమయానికి కాలేజికి చేరలేని పరిస్థితి నెలకొంది. దానితో ఈ విషయంపై అధికారులు బైక్ ను సీజ్ చేసి ఫైన్ వేసిన సరిపోయేదని, విద్యార్థులను పరీక్ష రాయకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితులు ఈ విషయంపై పోలీసు బాస్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో డీసీపీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.